:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / telangana / Nalgonda

కాంగ్రెస్‌ ప్రకటించింది దళిత డిక్లరేషన్‌ కాదు ఫాల్స్‌ డిక్లరేషన్‌

By Vinod Kumar | Posted on: 28-08-2023 18:08 | : 223



-  దళితబందు జిల్లా డైరెక్టర్ లపంగి నర్సింహా

మర్రిగూడ, ఆగస్టు 28 (వుదయం ప్రతినిధి):
బీఆరెస్ నేత, దళితబందు జిల్లా డైరెక్టర్ లపంగి నర్సింహా కాంగ్రెస్ పార్టీ పై ఫైర్ అయ్యారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేని ప్రేమను ఒలకబోస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ సభను చూస్తుంటే  లేనిపోని కల్లిబొల్లి మాటలు చెప్పి దళితులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు.   దేశంలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ  దళితులను ఎప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువనే ఉంచారు కానీ పైకి తీసుకువచ్చే పాపాన పోలేదని మండిపడ్డారు. తెలంగాణలో సబ్బండవర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ దళిత, పేద, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబితే ప్రజలు నమ్మరని భావించి మల్లికార్జున ఖర్గేను తీసుకొచ్చి సభ నిర్వహించారని తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదే కాంగ్రెస్ వాళ్లు కొత్తగా చెబుతున్నారని, అర్రస్ పాట పాడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బందు కింద రూ. 10 లక్షలు ఇస్తుంటే... వాళ్లు 12 లక్షలు ఇస్తామంటున్నారని, పెన్షన్ 2000 ఇస్తుంటే 4000 ఇస్తామని అంటున్నారు అని ఎద్దేవా చేశారు. కేవలం ఇది కాంగ్రెస్ భావదారిద్రమేనని స్పష్టం చేశారు. దళితుల పట్ల రైతుల పట్ల ప్రజల పట్ల ప్రేమ లేదని అన్నారు. నిజంగానే తెలంగాణ ప్రజలను ఉద్ధరించాలన్న ఆలోచన కాంగ్రెస్ కు ఏమీ లేదని, కేవలం రాజకీయ అవసరాల కోసం తప్పితే మరి ఏమీ కాంగ్రెస్కు పట్టవని ఫైర్ అయ్యారు. దేశంలో దళితుల అభ్యున్నతి కోసం విశేషంగా పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని, తెలంగాణలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని తెలిపారు. మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ దళితులకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. తప్పుడు డిక్లరేషన్లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.